8, మార్చి 2024, శుక్రవారం

ఆమె ఈ దేశానికి మనసిచ్చింది కానీ...

 ఆమె ఈ దేశానికి మనసిచ్చింది కానీ... 

ప్రెంచ్ సంతతికి చెందిన ఆమె భారతదేశంలో విద్యనభ్యసించడానికి పాతికేండ్ల కిందట వచ్చింది. భారత పౌరుడిని ప్రేమించి పెండ్లి చేసుకుంది. ఇక్కడే స్థిరపడింది. జీవనోపాధి కోసం జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకుంది. వృత్తి నిబద్ధతకు కట్టుబడి ఆమె రాసిన రాతలు రాజ్యానికి కంటగింపుగా మారాయి. ఇంకేముంది రాజ్యం బెదిరించింది. ఇక్కడి నుండి వెళ్లిపొమ్మని హుకుం జారీ చేసింది. ఈ దేశాన్ని ప్రేమించి ఇక్కడే స్థిరపడిన ఆమె ఇప్పుడు.. పుట్టుక మూలాలను వెతుక్కుంటూ నిష్క్రమించింది. బరువెక్కిన హృదయంతో న్యాయంపై నమ్మకంతో మళ్లీ తిరిగి వొస్తానన్న చిరు ఆశతో ప్రయాణమవుతూ ఓ లేఖను విడుదల చేసింది. 

ఆమె వనెసా డౌనక్ విదేశీ సీనియర్ జర్నలిస్టు. 1998లో భారతదేశానికి విద్యార్థినిగా వచ్చింది. 2001 నుంచి జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించింది. హర్యానాకు చెందిన సహపాఠీని ప్రేమ పెండ్లి చేసుకుంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఫ్రెంచ్, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. అయితే వనెసా ఎక్కువ కాలం ఇండియాలో ఉన్న విదేశీ సీనియర్ జర్నలిస్టు కూడా. ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా (ఓసిఐ) కార్డు కూడా ఉంది. లా క్రోయిక్స్, లే పాయింట్, లే టెంప్స్, లే సోయిర్ నాలుగు ఫ్రెంచ్ మీడియా సంస్థల దక్షిణాసియ ప్రతినిధిగా పని చేసింది. రెండు దశాబ్దాల చరిత్రకు సాక్షి ఆమె. 23 ఏండ్ల పాటు పాత్రికేయ రంగంలో అనేక కథనాలు అందించి ఆమెకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. భారత దేశంలో మానవ హక్కుల గురించి, దేశీయ రాజకీయాల గురించి అనేక విశ్లేషణాత్మక కథనాలను, వ్యాసాలను అందించారు. 

బిజెపి సారధ్యంలో జరుగుతున్న అమానవీయ ఘటనలను సాహసోపేతంగా వెలుగులోకి తెచ్చారు. కరోనా సమయంలో దేశ పరిస్థితిపై, పాలకుల పని తీరుపై, గంగా నదిలో మృతదేహాలు లభ్యంపై, అనేక ఘటనలపై అందించిన కథనాలు పాలకులను ఇరుకున పెట్టాయి. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పత్రికా స్వేచ్ఛ మరింత ప్రమాదంలో పడింది. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచీలో 180 దేశాలకు గాను భారత్ 21 స్థానాలు దిగజారి 161 పడిపోయింది. దేశంలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నందుకు హత్యకు కాబడిన జర్నలిస్టులు, దాడులకు గురైన జర్నలిస్టులు వేలాది మంది ఉన్నారు. ఉపా చట్టం లాంటి కేసులు మోపబడి జైలు జీవితం గడిపిన జర్నలిస్టులు అనేక మంది ఉన్నారు. ఆ కోవలోనే వనెసా డౌనక్ రాజ్య నిర్బంధానికి గురయ్యారు. రాజ్యాన్ని విధానపరంగా ప్రశ్నించే గొంతుకలను  కట్టడి చేయాలని, వారిని బానిసలుగా చేసుకోవాలనే కుట్ర తలంపుకు ఆ గొంతుక లెప్పుడు తలవంచవు. తలెత్తుకొని రాజ్యాన్ని నిగ్గదీసి ప్రశ్నిస్తుంటాయి. మరణ అంచున నిలబడ్డ వారిని చూసి కూడా రాజ్యం భయపడుతూ ఉంటది. ఊపిరినొదిలిన గొంతుకలు సైతం బలమైన ఆశయాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తూ ఉంటాయి. అందుకే ప్రశ్నను రాజ్యం ఎప్పుడు సహించదు. పీడనకు గురౌతున్న అణగారిన జనానికి వనెసా ఒక బలమైన గొంతుక.  అందుకు ఆమె కథనాలు దర్పణంగా నిలుస్తాయి. 

  2022 సెప్టెంబర్ లో ఆమె జర్నలిజం పర్మిట్ ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. వనెసా వినతులకి స్పందన లేదు. కక్షపూరితంగా వేధింపులకు గురిచేసింది. రెండు దశాబ్దాల జర్నలిస్టుకి, ఆమె చేసిన సేవలకు ఈ రూపంలో భారత మనువాద పాలకులు కానుక ఇచ్చారు. ఇప్పుడూ "ఓసీఐ కార్డు రద్దు ఉపసంహరణ ఎందుకు చేయకూడదు.." అంటూ హోంశాఖ జనవరి 24న నోటీసు ఇచ్చింది. గతంలో అధికారులు ఆమెను జర్నలిజం వొదిలేయాలని సలహాలు ఇచ్చారు. ఇష్టమైన, ప్రేమించే వృత్తిని వొదిలివేయాలని ఆమె అనుకోలేదు. తనపై నిరూపించని ఆరోపణలు చేశారని, తన రచనలను 'ద్వేషపూరితం' అంటూ వ్యాఖ్యలు చేశారని, ఉపద్రవం కలిగించేలా, శాంతిని భగ్నం చేసేవిగా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నట్లు వనెసా వెల్లడించింది. తనూ ప్రేమించిన ఈ దేశాన్ని, తన కుటుంబాన్ని వొదిలి వెళ్లేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చెబుతూ ఫిబ్రవరి 16న వెళ్లిపోతూ ఓ ప్రకటన విడుదల చేసింది. వృత్తి నిబద్ధతకు కట్టుబడి పని చేసిన ఆమెపై "భారత సార్వభౌమాధికారం, సమగ్ర ప్రయోజనాలకు  విఘాతం కలిగేలా ఆమె రచనలు ఉన్నాయని" చెప్పడం ద్వారా కాషాయ పాలకులు తమ కుటిల రాజ నీతిని ప్రదర్శించారు. వనెసా లాంటి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడానికి టార్గెట్ గా ఈ మహిళా జర్నలిస్టును ఎంచుకున్నారు.

 ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన పత్రికలను, జర్నలిస్టులను వేధించే చర్యల్లో భాగమే ఇలాంటివి. 2024 పార్లమెంట్ ఎన్నికలు రానున్న సమయంలో వీటిని తీవ్ర తరం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ పై విదేశీ కరస్పాండెంట్లు అంతర్జాతీయంగా ఆమెకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండును వినిపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు భారత్ ను కవర్ చేసే విదేశీ మీడియాను నియంత్రిస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేకపోలేదు. మీడియా స్వేచ్ఛను హరించడం, జర్నలిస్టుల గొంతుకను నొక్కేయడం భారత ప్రజాస్వామ్యానికి కళంకం లాంటిది, అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను దిగజార్చుతుంది. ఇలాంటి చర్యలు రాజ్య స్వభావాన్ని, పాలకుల అసహనాన్ని బయటపెడుతున్నాయి. భారతదేశాన్ని అమితంగా ప్రేమించే వనెసా లాంటి జర్నలిస్టులు ఈ సమాజానికి ఎంతో అవసరం. ఆమె మళ్లీ భారత్ కు తిరిగి రావాలని, ఆమెకు న్యాయం జరగాలని  ఆశిద్దాం.

 - మామిండ్ల రమేష్ రాజా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి